
మాస్ మహారాజా రవితేజ హీరోగా, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టైటిల్, కథా నేపథ్యం కారణంగా ఈ సినిమా అయ్యప్ప స్వామి భక్తి, శబరిమల యాత్ర చుట్టూ తిరుగుతుందని అభిమానులు భావించారు.
అయితే ఈ మూవీ కథాంశంపై దర్శకుడు శివ నిర్వాణ తాజాగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఇరుముడి’ అనేది శబరిమల యాత్ర, అయ్యప్ప స్వామి దర్శనం లేదా ఆధ్యాత్మిక అంశాలను ప్రధానంగా చేసుకుని రూపొందిస్తున్న భక్తి చిత్రం కాదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కథలో భక్తి అంశం కంటే మరింత బలమైన డ్రామా, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది.
అయ్యప్ప మాల ధరించే 41 రోజుల దీక్ష ఈ కథలో కీలక పాత్ర పోషించనుంది. ఆ దీక్ష ప్రారంభానికి ముందు హీరో జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి? దీక్ష సమయంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? అనే అంశాల చుట్టూనే కథ ప్రధానంగా సాగుతుందని సమాచారం. ఈ క్రమంలో చోటుచేసుకునే సంఘటనలు ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమా తొలుత ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రారంభమవుతుందని టాక్. అయితే కథ క్రమంగా ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకులు ఊహించని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని తెలుస్తోంది. నెమ్మదిగా మొదలై.. ఆ తర్వాత సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మారేలా కథనాన్ని దర్శకుడు శివ నిర్వాణ రూపొందించినట్లు సమాచారం.
క్రైమ్ మిస్టరీ అంశాలతో సాగే కథనం ప్రేక్షకులకు మైండ్ బెండింగ్ అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం చెబుతోంది. కథలో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి సినిమా మొత్తం కొనసాగుతుందని తెలుస్తోంది. సీరియస్ టోన్‌లో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనమయ్యేలా చేస్తాయని సమాచారం.
అదే సమయంలో ఈ ఉత్కంఠభరితమైన మిస్టరీ ప్రయాణానికి చివర్లో హృదయాన్ని హత్తుకునే బలమైన ఎమోషనల్ క్లైమాక్స్ ఉండనుందని టాక్. థ్రిల్‌తో పాటు లోతైన భావోద్వేగాలను కోరుకునే ప్రేక్షకులకు ‘ఇరుముడి’ ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించే సినిమాగా నిలుస్తుందని దర్శకుడు శివ నిర్వాణ చెప్పినట్లు తెలుస్తోంది.

