
D news: కర్లపొద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎం. మణి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం పాఠశాలకు వెళ్తున్న ఆమె.. వాగు దాటే క్రమంలో ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహానికి కొంతదూరం కొట్టుకుపోయారు.
అయితే, అదృష్టవశాత్తూ ఓ చెట్టు కొమ్మను పట్టుకుని సాయం కోసం కేకలు వేశారు. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలో పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా వాగుపై బ్రిడ్జి నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

