
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరిగిన దాదాపు పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు ముగించుకుని బెంగళూరుకు తిరిగి వచ్చిన అనంతరం శాఖల పంపకంపై నిర్ణయం తీసుకున్నారు.
అయితే కీలకమైన ఆర్థిక, ఇంటెలిజెన్స్ వంటి శాఖలను మాత్రం డీకే శివకుమార్ తన వద్దే ఉంచుకున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయినప్పటికీ.. కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అంశంపై ఆయన మరో కీలక ప్రకటన చేశారు.
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్లోకి ఒక మహిళా మంత్రిని తీసుకునే అవకాశం ఉందని డీకే శివకుమార్ వెల్లడించారు. దీంతో త్వరలోనే కర్ణాటక మంత్రివర్గంలో మరో మార్పు చోటుచేసుకునే అవకాశముంది.
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన మంత్రివర్గంలోని 23 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. ఆగస్టు 3న ఆయన కేబినెట్‌ను విస్తరించిన విషయం తెలిసిందే.
శాఖల పంపకంలో భాగంగా కీలకమైన ఆర్థిక, మంత్రివర్గ వ్యవహారాలు, సిబ్బంది–పరిపాలనా సంస్కరణలు, నిఘా, సమాచార, న్యాయ, శాసనసభ వ్యవహారాల శాఖలను డీకే శివకుమార్ తన వద్దే ఉంచుకున్నారు. అలాగే వ్యవసాయ మార్కెటింగ్, పట్టణ–గ్రామీణ ప్రణాళిక, బెంగళూరు నగరాభివృద్ధి వంటి ముఖ్యమైన శాఖలు కూడా సీఎం పరిధిలోనే కొనసాగనున్నాయి.
మంత్రులకు కేటాయించని శాఖల బాధ్యతలను కూడా డీకే శివకుమార్ స్వయంగా నిర్వహించనున్నారు. దీంతో కీలక శాఖల్లో ఎక్కువ భాగం సీఎం వద్దే ఉండటం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
మంత్రులు – వారి శాఖలు
కర్ణాటక మంత్రివర్గంలో శాఖల పంపకం పూర్తైంది. యూటీ ఖాదర్‌కు మైనారిటీ సంక్షేమం, హజ్–వక్ఫ్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖలను కేటాయించారు.
ఆర్. రామలింగారెడ్డికి అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు అప్పగించారు. కే.హెచ్. మునియప్పకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్- గృహనిర్మాణం
లక్ష్మణ్ సవాడి- సహకార శాఖ (వ్యవసాయ మార్కెటింగ్ మినహా)
రుద్రప్ప మనప్పలమణి- చక్కెర వస్త్ర పరిశ్రమ
శివరాజ్ తంగడగి- వెనుకబడిన తరగతుల సంక్షేమం; కన్నడ సంస్కృతి
టీ రఘుమూర్తి – ఎస్టీ సంక్షేమం
డాక్టర్ అజయ్ సింగ్ – చిన్నతరహా నీటిపారుదల; సైన్స్ అండ్ టెక్నాలజీ
చెలువరాయస్వామి – భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ
మధు బంగారప్ప – ప్రాథమిక, మాధ్యమిక విద్య
బసవరాజ రాయ రెడ్డి – ఉన్నత విద్య
శివలింగే గౌడ – ఎక్సైజ్
పుట్టరంగ శెట్టి- పశు సంవర్ధక, సెరికల్చర్
విజయానంద కాశప్పనవర్ – చిన్న తరహా పరిశ్రమలు; పబ్లిక్ ఎంటర్ప్రైజెస్
సంతోష్ లాడ్ – లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్
కె ఎస్ బసవంతప్ప – ముజ్రాయ్; మత్స్య సంపద; ఓడరేవులు, అంతర్గత జలాలు
ఎస్ ఎస్ మల్లికార్జున్ – మైన్స్ అండ్ జియాలజీ; హార్టికల్చర్
రిజ్వాన్ అర్షద్ – ఆహార పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు
నరేంద్ర స్వామి- వ్యవసాయం
హెచ్ సి బాలకృష్ణ- పురపాలక పరిపాలన
బి నాగేంద్ర- ప్రణాళిక మరియు గణాంకాలు

