
సైబర్ నేరగాళ్లు భారీగా సొమ్ము కొల్లగొడుతుంటే.. బాధితులకు తిరిగి అందుతున్న మొత్తం మాత్రం తక్కువగానే ఉంటోంది. సైబర్ మోసం జరిగిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో 1930కు ఫిర్యాదు చేస్తే, నిందితుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే నిందితులు నగదు డ్రా చేయడం లేదా ఇతర ఖాతాలకు బదిలీ చేయడంతో రికవరీ కష్టమవుతుంది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వేల సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నా.. నిందితుల నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో ఛేదించడంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకునేవని, ప్రస్తుతం అలాంటి దూకుడు తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సైబర్ నేరాల నియంత్రణకు కేవలం 1930, సైబర్ పోర్టల్‌పైనే ఆధారపడకుండా.. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సమర్థులైన అధికారులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలతో నేరగాళ్ల నెట్వర్క్ మూలాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రజల్లో అవగాహన పెంచడం కూడా కీలకం.

