కేవలం రూ.99 చెల్లిస్తే చాలు.. కేంద్రం బంపర్ స్కీమ్.. పూర్తి వివరాలు ఇవే!

D news: గిగ్‌ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్‌, ఓలా, ఉబర్‌, ర్యాపిడో, అర్బన్‌ కంపెనీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే వారి కోసం ప్రత్యేక పెన్షన్‌ పథకాన్ని తీసుకొచ్చింది. జాతీయ పింఛన్‌ వ్యవస్థ (NPS) కింద పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని ప్రారంభించింది.

రూ.99తో పెట్టుబడి ప్రారంభం

ఈ పథకంలో గిగ్‌ వర్కర్లు కేవలం రూ.99తోనే చందా ప్రారంభించవచ్చు. ఆ తర్వాత తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పెట్టుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, ఈ పథకంలో చేరేందుకు గరిష్ట వయోపరిమితి కూడా విధించలేదు.

గిగ్‌ వర్కర్లు తమకు వీలైనంత కాలం చందాలు కొనసాగించవచ్చు. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా పొందే అవకాశం ఉంటుంది.

ఎవరెవరు చేరొచ్చు?

డిజిటల్‌, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పనిచేసే గిగ్‌ వర్కర్లు ఈ పథకంలో చేరవచ్చు. ముఖ్యంగా:

  • స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్‌ వంటి ఫుడ్‌, గ్రోసరీ డెలివరీ సంస్థల ఉద్యోగులు
  • ఓలా, ఉబర్‌, ర్యాపిడో వంటి రైడ్‌-హెయిలింగ్‌ డ్రైవర్లు
  • అర్బన్‌ కంపెనీ వంటి గృహ సేవల ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసేవారు
  • ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు అనుబంధంగా పనిచేసే గిగ్‌ వర్కర్లు

NPS అకౌంట్‌ ఎలా తెరవాలి?

గిగ్‌ వర్కర్స్‌ పెన్షన్‌ పథకం ఆప్షన్‌ను ఎంచుకుని NPS ఖాతా తెరవాలి. ఇందుకోసం పేరు, ఆధార్‌ వివరాలు, పాన్‌, మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలతో పాటు అవసరమైన KYC వివరాలను సమర్పించాలి. అనంతరం కార్మికుడి సమ్మతితో శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) జారీ చేస్తారు.

ఆన్‌బోర్డింగ్‌ పూర్తయిన 60 రోజుల్లోపు తల్లిదండ్రులు, నామినీకి సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది.

కంపెనీ మారినా ఖాతా కొనసాగింపు

ఈ పథకంలో ఒకసారి NPS ఖాతా తెరిచిన తర్వాత గిగ్‌ వర్కర్‌ కంపెనీ లేదా అగ్రిగేటర్‌ను మార్చినా ఖాతా కొనసాగుతుంది. కొత్త అగ్రిగేటర్‌తో ఖాతాను అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది.

60 ఏళ్ల తర్వాత డబ్బు

60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. పెట్టుబడి చేసిన నిధులను ప్రభుత్వ బాండ్లు, ఈక్విటీ మార్కెట్లు వంటి సాధనాల్లో పెట్టుబడి పెడతారు. మార్కెట్‌ ఆధారిత పెట్టుబడులు కావడంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందే అవకాశం ఉన్నప్పటికీ, రాబడి మార్కెట్‌ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

By Ramya