
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్ ప్రాజెక్టులో రాష్ట్ర వాటాగా ఉన్న రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మొత్తం రూ.40 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు చెప్పారు.
ప్రపంచ బ్యాంకు నుంచి 300 కోట్ల అమెరికన్ డాలర్ల (రూ.28,500 కోట్లు) రుణానికి కూడా కేంద్రం ఆమోదం లభించిందన్నారు. ఇందులో 25 శాతం వాటాను కేంద్రం భరించనుండగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం చెల్లించనుంది. అదనంగా రూ.10 వేల కోట్లను కేంద్రం అందించనుంది.
రాయలసీమలోని ఎనిమిది జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఉద్యాన హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, ఉద్యానవన రంగ అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించగా, ఈ నెలాఖరులో మదనపల్లెలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

