
పాయకాపురం, ఆగస్టు 18, D news: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్‌నగర్ ప్రాంతంలో రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో జీరో అవర్‌లో ఆయన ఈ సమస్యను ప్రస్తావించారు.
1995లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో సింగ్‌నగర్‌లో తొలి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించారని బొండా ఉమా తెలిపారు. దాదాపు 30 ఏళ్లు గడిచినా రెండో ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సింగ్‌నగర్ పరిసరాల్లో సుమారు 1.50 లక్షల మంది నివసిస్తున్నారని, ప్రతిరోజూ ఉద్యోగాలు, విద్య, వ్యాపారాల కోసం రాకపోకలు సాగించే ప్రజలకు ప్రస్తుత బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ ప్రాంతం నియోజకవర్గానికి ప్రధాన బాటిల్‌నెక్‌గా మారిందన్నారు.
రెండో ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వే శాఖ సుమారు రూ.70 కోట్ల వ్యయం అవుతుందని తెలిపిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కోరారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పనులను వెంటనే ప్రారంభించాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. సింగ్‌నగర్ ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రెండో ఫ్లైఓవర్‌ను అత్యంత ప్రాధాన్యతతో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.

