
జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో పర్యటిస్తున్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇస్లామాబాద్‌లోని అమెరికా దౌత్య అధికారిని పిలిపించిన పాక్.. తమ నిరసనను అధికారికంగా తెలియజేసింది. అమెరికా వైఖరి తమ విధానానికి విరుద్ధంగా ఉందని ఆరోపించింది.
ఈ పరిణామాలపై తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్థాన్ వ్యక్తం చేస్తున్న నిరాశకు భారత్ స్పందించాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పునరుద్ఘాటించారు.
‘జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం’ అంటూ అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇస్లామాబాద్‌లోని అమెరికా దౌత్యవేత్తకు పాక్ సమన్లు జారీ చేసి తన నిరసనను తెలిపింది.
పాకిస్థాన్ అభ్యంతరాలను భారత్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లు భారత్‌లో విడదీయరాని అంతర్భాగాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాలు గతంలోనూ భారత్‌లో భాగమేనని, ప్రస్తుతం కూడా భారత్‌లోనే ఉన్నాయని, భవిష్యత్తులోనూ భారత్‌లోనే కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు.
సెర్గియో గోర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ వ్యక్తం చేసిన నిరసనపై మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. పాకిస్థాన్ నిరాశ, నిస్పృహపై తాను వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘పాకిస్థాన్ నిరాశపై స్పందించడానికి నాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. నేను చెప్పదలచుకున్నది ఇదే’’ అని పేర్కొన్నారు.
సెర్గియో గోర్ ఏమన్నారు?
జమ్మూ కశ్మీర్, లడఖ్‌లో పర్యటిస్తున్న అమెరికా రాయబారి సెర్గియో గోర్.. జమ్మూ కశ్మీర్ భారత్‌లోని ఒక ముఖ్యమైన ప్రాంతమని వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం భారత్‌లో అత్యంత కీలకమైనదని, అందుకే తాను తొలిసారి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ అందాలు తనను ఆకట్టుకున్నాయని, ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందని గోర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం కూడా సానుకూలంగా సాగిందని, ఇక్కడి అనుభవాలు, విశేషాలను వాషింగ్టన్‌తో పాటు ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, జమ్మూ కశ్మీర్‌కు వెళ్లే విషయంలో అమెరికా పౌరులకు ప్రస్తుతం ‘లెవెల్ 4 – ప్రయాణాలు చేయవద్దు’ అనే ట్రావెల్ అడ్వైజరీ అమల్లో ఉంది. భవిష్యత్తులో ఈ హెచ్చరికను ఉపసంహరించాలా లేదా దాని తీవ్రతను తగ్గించాలా అనే అంశాన్ని పరిశీలిస్తామని గోర్ తెలిపారు.
ఈ ప్రాంతం ఎంతో అందమైనదని, భవిష్యత్తులో మరింత మంది అమెరికన్లు జమ్మూ కశ్మీర్‌ను సందర్శించి ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని, అవకాశాలను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

