
దిగువ కోర్టుల్లో జడ్జిలుగా సేవలందించాలనుకునే లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు కీలక వెసులుబాటు కల్పించింది. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యేందుకు గతంలో తప్పనిసరిగా మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవం ఉండాలనే నిబంధనను సుప్రీంకోర్టు సవరించింది. ఇకపై కనీసం ఏడాది న్యాయవాద అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షలకు అర్హత పొందనున్నారు.
అదే సమయంలో, న్యాయమూర్తి పదవికి ఎంపికయ్యే అభ్యర్థులకు ఏడాదిన్నరపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్, క్లర్క్‌షిప్ వంటి అంశాలను కలిపిన కొత్త మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మార్పులతో న్యాయవృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన లా గ్రాడ్యుయేట్లకు జ్యుడీషియల్ సర్వీసెస్‌లో అవకాశాలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
న్యాయశాస్త్ర పట్టభద్రులకు సుప్రీంకోర్టు శుభవార్త అందించింది. దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులుగా ఎంపికయ్యేందుకు నిర్వహించే ప్రాథమిక స్థాయి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కీలక సడలింపులు కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
ఇప్పటివరకు జడ్జి పోస్టులకు పోటీ పడాలంటే న్యాయవాదిగా కనీసం మూడేళ్ల వృత్తి అనుభవం తప్పనిసరిగా ఉండేది. అయితే ఈ నిబంధనను సుప్రీంకోర్టు సవరించింది. ఇకపై కనీసం ఏడాది పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అభ్యర్థులు కూడా జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులు అవుతారని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో న్యాయవృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన లా గ్రాడ్యుయేట్లకు న్యాయ సేవల్లోకి ప్రవేశించే అవకాశాలు మరింత పెరగనున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొన్న పూర్తి వివరాలు ఏమిటి? కొత్త నిబంధనలు ఎలా ఉండనున్నాయి? అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది? పూర్తి వివరాలు మీకోసం.
మూడేళ్ల నిబంధనకు సడలింపు
జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన అర్హత నిబంధనల్లో సుప్రీంకోర్టు కీలక మార్పులు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎ.జి. మాసిహ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది.
తాజా ఆదేశాల ప్రకారం.. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యేందుకు అభ్యర్థులకు కనీసం ఏడాది పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంటే సరిపోతుంది. గతంలో, 2025 మేలో అప్పటి సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పరీక్షలకు మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఈ నిబంధనను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన ప్రస్తుత ధర్మాసనం కీలక మార్పులు చేసింది.
2025లో మూడేళ్ల అనుభవ నిబంధనపై తీర్పు వెలువడినప్పటి నుంచి ఇప్పటికే ఏడాది గడిచిందని, అందువల్ల అప్పట్లో తాజా లా గ్రాడ్యుయేట్లుగా ఉన్న అభ్యర్థులు ఏడాది వృత్తి అనుభవం పూర్తి చేసినట్లుగానే పరిగణిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు ప్రత్యేకంగా అనుభవ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో వారు జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు అర్హులుగా పరిగణించబడతారని పేర్కొన్నారు.
అయితే పరీక్షలో విజయం సాధించి జడ్జిలుగా ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరి న్యాయపరమైన బాధ్యతలు చేపట్టలేరు. విధుల్లో చేరే ముందు వారు రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ద్వారా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను అభ్యర్థులు పొందనున్నారు.

