D-News: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని గన్నెల గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సంజీవని హెల్త్‌కేర్‌ ప్రాజెక్ట్‌’ పైలట్‌ దశను అధికారికంగా ప్రారంభించారు.

గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ డిజిటల్‌ ఆరోగ్య కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ ఏర్పాటు చేయడంతో పాటు, AI ఆధారిత వైద్య నిర్ధారణలు, ఉచిత సమగ్ర వైద్య సేవలను అందించేందుకు ప్రాజెక్ట్‌ ద్వారా చర్యలు చేపట్టనున్నారు.

‘ప్రజా వేదిక’లో ప్రజల నుంచి వినతులు

గన్నెల గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా స్థానిక మౌలిక వసతులు, వైద్య సేవలకు అందుబాటు, రహదారి సదుపాయాలు, ఇతర పౌర సమస్యలకు సంబంధించిన వినతులను సమర్పించారు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు అక్కడికక్కడే స్పందించారు. సమస్యల పరిష్కారంపై జిల్లా ఉన్నతాధికారులను వేదికపైకి పిలిపించి, పెండింగ్‌లో ఉన్న అంశాలపై తక్షణమే సమీక్ష నిర్వహించారు.

నిర్లక్ష్యంపై సీఎం సీరియస్‌

గిరిజన ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

గిరిజన సంక్షేమం, ఆరోగ్యం, రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారుల నిర్లక్ష్యం లేదా పరిపాలనా జాప్యాన్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

‘సంజీవని’ ప్రాజెక్ట్‌ ద్వారా గిరిజన కుటుంబాలకు ఆధునిక వైద్య సదుపాయాలను మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే విధానానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *