గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డ్రోన్ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 24,500 మందికి వైద్య సేవలు అందించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

అరకు పరిధిలోని ఆస్పత్రులతో అనుసంధానమైన నాలుగు డ్రోన్లు ఇప్పటివరకు 1,800 ట్రిప్పులు నిర్వహించాయి. మొత్తం 71 వేల కిలోమీటర్లు ప్రయాణించిన డ్రోన్ల ద్వారా 2,200కు పైగా వైద్య పరీక్షల నమూనాలను తరలించినట్లు మంత్రి వెల్లడించారు.

కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు వైద్య పరీక్షలు, మందుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తగ్గించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సత్యకుమార్ తెలిపారు. మందులు, వైద్య పరీక్షల నమూనాలు, అత్యవసర వైద్య సామగ్రిని వేగంగా తరలించడం ద్వారా రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఇది ఉపయోగపడుతోందన్నారు.

ఈ డ్రోన్లు పాడేరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు లోథుగెడ్డ, తాజంగి, సుంకరమెట్ట, భీమవరం, అనంతగిరి, ముంచింగిపట్టు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానమై ఉన్నాయని మంత్రి వివరించారు.

డ్రోన్ కార్యకలాపాలు, సహాయక సేవల్లో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు 25 మంది గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో డ్రోన్ టెక్నాలజీ కీలకంగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *