
వెబ్ డెస్క్: వెలిగొండ జలాలు కరవు ప్రాంతాల్లో కొత్త జీవాన్ని నింపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో ప్రజల తాగునీటి అవసరాలు తీరడంతో పాటు మూగజీవాలు, పశుపక్ష్యాదులకు కూడా ఉపశమనం లభిస్తోందని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు. “జలంతోనే.. జీవం, జీవితం” అంటూ వెలిగొండ జలాల ప్రాధాన్యాన్ని వివరించారు.
వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద వానరాలు దాహం తీర్చుకుంటున్న వీడియోను చంద్రబాబు తన పోస్టుతో పాటు పంచుకున్నారు. కెనాల్లో ప్రవహిస్తున్న నీటి వద్దకు చేరుకున్న వానరాలు నీటిని తాగుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.
గతంలో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాల్లోకి వెలిగొండ జలాలు చేరడం ఆనందకరమైన పరిణామమని సీఎం పేర్కొన్నారు. నీటి లభ్యతతో పంటలకు మాత్రమే కాకుండా పశుపక్ష్యాదులు, వన్యప్రాణులకు కూడా ప్రయోజనం కలుగుతోందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతున్న నేపథ్యంలో ప్రాంతంలో చోటుచేసుకుంటున్న మార్పులకు వానరాలు నీరు తాగుతున్న దృశ్యాలు ఓ చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. నీరు ఉంటేనే జీవం.. నీటి లభ్యతతోనే జీవనం సాఫీగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
