
స్వచ్ఛ గోదావరి.. పవిత్ర పుష్కరాలు’ థీమ్‌తో గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్నారు. పుష్కరాల సందర్భంగా మూడు జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే ఏపీపీసీబీ ద్వారా కేటాయించిన రూ.100 కోట్లకు ఇవి అదనం.
ఈ నిధులతో రూ.90 కోట్లతో 111 పనులు చేపట్టి సుమారు 141 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రహదారులను నిర్మించనున్నారు. మరో రూ.10 కోట్లతో పుష్కర భక్తులకు రక్షిత తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. రాజోలు, పి.గన్నవరం, రామచంద్రపురం, రంపచోడవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో గ్రామాల నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
పుష్కరాలను ప్రధాన కేంద్రాలకే పరిమితం చేయకుండా గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లోనూ భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఘాట్ల వద్ద రక్షిత తాగునీరు, రహదారులు వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇప్పటికే రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని మునికూడలిని రూ.7 కోట్లతో ‘మోడల్ పుష్కర పంచాయతీ’గా అభివృద్ధి చేస్తున్నారు. సప్త ఋషి ఘాట్‌తో పాటు సీసీ రహదారులు, టవర్ లైట్లు, మ్యాజిక్ డ్రెయిన్లు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఏపీపీసీబీ ద్వారా కేటాయించిన రూ.100 కోట్లను జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ప్రాధాన్య క్రమంలో వినియోగించి, గోదావరి పుష్కరాలను పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.
