
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సెటైర్లు వేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. అయితే ఆ ప్రకటనల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఏబీవీ సీఎం చంద్రబాబు నాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘గోదావరి పరవళ్లు – ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ప్రచురించారు. అయితే నీటిపారుదల శాఖకు సంబంధించిన కార్యక్రమం కావడంతో సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో లేకపోవడంపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మినహా మిగతా మంత్రులు నామమాత్రమే అన్నది అందరికీ తెలిసిన విషయమంటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమంలో ఇరిగేషన్ మంత్రి ఫొటో లేకుండా ఇతర శాఖలకు చెందిన మంత్రుల ఫొటోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
2018లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కొంతకాలం కేవలం ఇద్దరు మంత్రులతోనే ప్రభుత్వం నడిపిన విషయాన్ని ప్రస్తావించిన ఏబీవీ.. చంద్రబాబు కూడా ముగ్గురు సభ్యులతో కూడిన కేబినెట్‌తోనే పాలన సాగించవచ్చుగా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు
మరోవైపు పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయం నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికే పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
తొలుత అనకాపల్లి జిల్లాకు నీటిని అందిస్తున్నారు. దేవీపట్నం మండలం నేలకోట వద్ద ప్రారంభమయ్యే పోలవరం ఎడమ కాలువ సుమారు 213.409 కిలోమీటర్ల మేర విస్తరించి విశాఖపట్నం వరకు సాగుతుంది. పోలవరం ప్రధాన జలాశయం పూర్తికాకముందే పుష్కర, పురుషోత్తపట్నం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల సహాయంతో గోదావరి జలాలను ఎడమ కాలువలోకి తరలిస్తున్నారు.
