
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరంలో జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అందిస్తున్న అన్నప్రసాద పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి గత జులై 2న అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. అయితే, నిత్యాన్నదాన పథకం ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు భోజనం అందించే విషయంలో తలెత్తిన కొన్ని సాంకేతిక, పరిపాలనపరమైన సమస్యల కారణంగా కొద్ది రోజులకే పథకం నిలిచిపోయింది.
తాజాగా అన్నప్రసాద పథకాన్ని పునఃప్రారంభించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అనుమతి ఇచ్చారు. పథకం అమలుకు సుమారు రూ.35 లక్షల అంచనా వ్యయాన్ని అన్నవరం దేవస్థానం నిధుల నుంచి వెచ్చించేందుకు అనుమతి లభించింది. దీంతో త్వరలోనే విద్యార్థులకు అన్నప్రసాద వితరణను పునఃప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నవరం కొండ దిగువన దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుండటంతో వారికి మధ్యాహ్న భోజనం అందించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది.
ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న సుమారు 150 మంది విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. భక్తులకు పంపిణీ చేసే అన్నప్రసాదంలో భాగంగానే విద్యార్థులకు కూడా భోజనం అందుతోంది. ఇందులో సత్యదేవుడి గోధుమనూక ప్రసాదంతో పాటు పప్పు, అన్నం, పచ్చడి, ఒక కూర, సాంబారు, మజ్జిగ ఉంటాయి.
జూనియర్ కాలేజీలో సుమారు 200 మంది, డిగ్రీ కాలేజీలో 300 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా అన్నప్రసాదం అందించాలని గతంలో నిర్ణయించారు. తాజాగా దేవాదాయశాఖ నుంచి అనుమతి రావడంతో ఈ రెండు కాలేజీల విద్యార్థులకు కూడా అన్నప్రసాద పథకాన్ని త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నారు.
