అమరావతి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో సాగు, తాగునీటి రంగానికి కొత్త కళ వస్తుందని ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

అమరావతిలో మీడియాతో మాట్లాడిన కాల్వ శ్రీనివాసులు.. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంలో చంద్రబాబుకు ప్రత్యేక దృష్టి ఉందన్నారు. రాయలసీమకు అదనపు జలాలను తీసుకురావాలన్న ఆలోచనను ఎన్టీఆర్‌ ముందుకు తీసుకురాగా, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 2014–19 మధ్య రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,441 కోట్లు ఖర్చు చేయగా, గత ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు అందించిన ఘనత చంద్రబాబుదేనని ఆయన పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు హయాంలో రూ.5,233 కోట్లు ఖర్చు చేయగా, జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ.840 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

సాగు, తాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి, కృష్ణా జలాలను తరలించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వానికి మాట్లాడే అర్హత లేదని జగన్‌పై కాల్వ శ్రీనివాసులు విమర్శలు చేశారు. వెలిగొండలో 55 శాతం పనులు పూర్తి చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి క్రెడిట్‌ దక్కుతుందా.. 8 శాతం పనులు చేసిన వారికి దక్కుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు, ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *