
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కుమార్తె మైనర్ పాస్‌పోర్ట్ దరఖాస్తు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీని సంప్రదించగా.. రూ.35 వేలు చెల్లించాలని ఏజెన్సీ ప్రతినిధి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అంత మొత్తం ఎందుకు ఖర్చవుతుందని రాధాకృష్ణ ప్రశ్నించడంతో.. సదరు వ్యక్తి ఫోన్‌లో దుర్భాషలాడటంతో పాటు ‘పాస్‌పోర్ట్ మీకు ఎలా వస్తుందో చూస్తా’ అంటూ బెదిరించినట్లు సమాచారం. దీంతో రాధాకృష్ణ విజయవాడ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడి వివరాలను సేకరిస్తున్నారు. అతడి పేరు మొయినుద్దీన్‌గా, హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ ఏజెన్సీ నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
రాధా భార్య కుటుంబ నేపథ్యం
వంగవీటి రాధాకృష్ణకు నరసాపురానికి చెందిన జక్కం బాబ్జీ, అమ్మాణి దంపతుల కుమార్తె పుష్పవల్లితో 2023లో వివాహమైంది. ఈ దంపతులకు గతేడాది కుమార్తె జన్మించగా.. రుధిర అని పేరు పెట్టారు.
పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాణి 1987-92 మధ్య నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె తండ్రి జక్కం బాబ్జీ నరసాపురం టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం వీరు జనసేనలో కొనసాగుతున్నారు. పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సందర్భంగా వారి నివాసంలో బస చేశారు.
