
పట్టణాల అభివృద్ధిలో ప్రజా రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, జనాభా విస్తరణతో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. మెట్రో రైలు వ్యవస్థకు ప్రాధాన్యం పెరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. రహదారులపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించడంలో మెట్రో ఒక సమర్థవంతమైన పరిష్కారంగా నిలుస్తోంది.
భారత్‌లో తొలిసారిగా 1984లో మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి నాలుగు దశాబ్దాల కాలంలో దేశంలోని అనేక ప్రధాన నగరాలకు మెట్రో సేవలు విస్తరించాయి. దీంతో పట్టణ ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు కీలక భాగంగా మారింది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగిన దేశంగా చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో ఉంది. అయితే భారత్‌లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇదే వేగం కొనసాగితే.. త్వరలోనే మెట్రో రైలు నెట్‌వర్క్ పరంగా అమెరికాను భారత్ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా భారత్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 1,170 కిలోమీటర్లకు చేరుకున్న భారత మెట్రో నెట్‌వర్క్.. త్వరలోనే అమెరికా నెట్‌వర్క్‌ను అధిగమించే దిశగా సాగుతోంది. ఈ విస్తరణ పూర్తయితే.. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది.
ఇండోర్‌లో మెట్రో రైలు సేవలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో భారత్ మెట్రో నెట్‌వర్క్ అమెరికాను అధిగమించే అవకాశం ఉందని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుల విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికాలో సుమారు 1,386 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్ ఉంది. ఇండోర్ మెట్రో లైన్ పొడిగింపుతో భారత్‌లోని మెట్రో నెట్‌వర్క్ 1,170 కిలోమీటర్లకు చేరింది. అంటే అమెరికాతో పోలిస్తే భారత్ కేవలం 216 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోవైపు దాదాపు 8,000 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌తో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.
2014లో భారత్‌లో కేవలం ఐదు నగరాల్లోనే 245 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులో ఉండేవి. అయితే గత దశాబ్ద కాలంలో ఈ రంగంలో భారీగా విస్తరణ చోటుచేసుకుంది. ప్రస్తుతం దేశంలోని 26 నగరాలకు మెట్రో సేవలు విస్తరించగా.. మొత్తం నెట్‌వర్క్ 1,170 కిలోమీటర్లకు చేరిందని కేంద్ర మంత్రి తెలిపారు. మెట్రో విస్తరణ వేగం ఇలాగే కొనసాగితే.. ప్రపంచ మెట్రో మ్యాప్‌లో భారత్ మరింత కీలక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.
మెట్రో రైలు కేవలం ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చే రవాణా సాధనం మాత్రమే కాదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రజల ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడంతో పాటు.. పట్టణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో మెట్రో రైలు వ్యవస్థ కూడా ముఖ్యమైన భాగస్వామిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఇండోర్ మెట్రో విస్తరణ
ఇండోర్ మెట్రో రైలు ప్రాజెక్టును మొత్తం రూ.2,850 కోట్ల అంచనా వ్యయంతో విస్తరించారు. గతంలో గాంధీనగర్ నుంచి సూపర్ కారిడార్-3 వరకు 6 కిలోమీటర్ల మేర ఉన్న కమర్షియల్ రూట్‌ను.. తాజాగా గాంధీనగర్ నుంచి మాలవీయ నగర్ చౌరహా వరకు 17 కిలోమీటర్లకు పొడిగించారు.
ఈ మార్గంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున నడపనున్నారు. దీంతో నగరంలో ప్రజా రవాణా మరింత సులభతరం కావడంతో పాటు.. రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇండోర్ మెట్రో సేవలను ఉజ్జయిని, పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అలాగే రూ.18,500 కోట్ల వ్యయంతో ఇండోర్-మన్మాడ్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
