
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేసిన సైగలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. మీసా చట్టం కింద అరెస్టైన స్టాలిన్‌పై అప్పట్లో పోలీసులు దాడి చేయగా, ఆయన దవడకు గాయమైంది.
అదే ఘటనను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ అసెంబ్లీలో స్టాలిన్‌ను ఉద్దేశించి సైగలు చేయడం వివాదాస్పదంగా మారింది. చారిత్రకంగా జరిగిన ఒక తీవ్ర ఘటనను ఎగతాళి చేసేలా సీఎం వ్యవహరించారని విపక్షాలు మండిపడ్డాయి. పార్టీలకు అతీతంగా పలువురు ప్రతిపక్ష నేతలు విజయ్ తీరును తీవ్రంగా ఖండిస్తూ, అసెంబ్లీ వంటి వేదికపై ఇలాంటి సంజ్ఞలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మీసా అరెస్టు అంశం అధికార టీవీకే (TVK), ప్రతిపక్ష డీఎంకే (DMK) మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఎమర్జెన్సీ కాలంలో 1971 నాటి అంతర్గత భద్రతా పరిరక్షణ చట్టం (MISA) కింద స్టాలిన్ అరెస్టు కావడంపై సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వివాదం సభలో నిరసనలకు, స్పీకర్ సభను నిర్వహిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరాలకు దారితీసింది. సభ నిర్వహణపై స్టాలిన్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సోమవారం ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీసా అరెస్టు, ఆ సమయంలో ఆయనకు తగిలిన దవడ గాయం అంశాన్ని ప్రస్తావించారు. విజయ్ చేసిన వ్యాఖ్యలు, సంజ్ఞలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్టాలిన్ దవడ గాయాన్ని ఉద్దేశిస్తూ సీఎం చేసిన సంజ్ఞ బాడీ షేమింగ్‌కు పాల్పడినట్లుగా ఉందంటూ పార్టీలకు అతీతంగా విపక్ష నేతలు మండిపడ్డారు.
మీసా అరెస్టుపై విజయ్ ప్రశ్నలు
‘‘మా మిత్రులు ప్రతిదానికీ మేము మీసాను చూశామని చెబుతుంటారు. ప్రతిదానికీ మీసాను తీసుకువస్తే ఏం చేయాలో తెలియదు. గౌరవనీయులైన పెద్దలారా.. ఆ మీసా చరిత్ర గురించి అందరికీ తెలుసు’’ అని విజయ్ వ్యాఖ్యానించారు.
స్టాలిన్ తరచూ ప్రస్తావించే మీసా అరెస్టు వాస్తవికతపై కూడా విజయ్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో కుడిచేతిని దవడపై ఉంచుకుని చేసిన సంజ్ఞ ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. స్టాలిన్ మీసా అరెస్టు సమయంలో పోలీసుల దాడిలో దవడకు గాయం కావడాన్ని ఉద్దేశించే ఈ సంజ్ఞ చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి.
ఒక చారిత్రక రాజకీయ ఘటనను వ్యక్తిగత శారీరక గాయంతో ముడిపెట్టి ఎగతాళి చేయడం సరికాదంటూ ప్రతిపక్ష పార్టీలు విజయ్ తీరును తీవ్రంగా ఖండించాయి. అసెంబ్లీ వేదికపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు, సంజ్ఞలు చేయడం తగదని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
