
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో చేపట్టనున్న రైలు మార్గాల అనుసంధాన ప్రాజెక్టులకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.20,804 కోట్ల అంచనా వ్యయంతో 8 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో ఐదు ప్రాజెక్టులు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోనే ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ప్రయాణికుల రాకపోకలతో పాటు సరకు రవాణా కూడా సులభతరం కానుంది. కొత్త రైలు మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలు విస్తరించడంతో దాదాపు కోటి మందికిపైగా ప్రజలకు ప్రయోజనం కలగనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో చేపట్టనున్న రూ.20,804 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మొత్తం 1,196 కిలోమీటర్ల మేర విస్తరించనున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే దేశంలోని రైలు అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఉన్న మార్గాలపై రద్దీ తగ్గనుంది. ఫలితంగా ప్రయాణికుల రాకపోకలతో పాటు సరకు రవాణా వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రైల్వే ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సరుకులు, ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇవి కీలకంగా దోహదపడతాయని తెలిపింది.
దేశంలోని రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా మొత్తం ఎనిమిది కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 540 కిలోమీటర్ల మేర విస్తరించనున్నాయి.
ఈ ఐదు ప్రాజెక్టుల్లో అరక్కోణం–రేణిగుంట మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం (77 కి.మీ), వైట్‌ఫీల్డ్–బంగారపేట మధ్య మూడో, నాలుగో లైన్లు (47 కి.మీ), హోసూర్–ఓమలూర్ డబ్లింగ్ (147 కి.మీ), సేలం–కరూర్–దిండిగల్ డబ్లింగ్ (159 కి.మీ), సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)–కాజీపేట మల్టీట్రాకింగ్ (110 కి.మీ) ఉన్నాయి.
మరోవైపు రూ.10,783 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూడు ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మొత్తం 656 కిలోమీటర్ల మేర విస్తరించనున్నాయి. వీటిలో ఖరగ్‌పూర్–ఝార్సుగూడ (బాగ్దేహి) నాలుగో లైన్, కట్నీ–పెండ్రా రోడ్ నాలుగో లైన్, బిలాస్‌పూర్ (ఉస్లాపూర్)–పెండ్రా రోడ్ మూడో లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో చేపట్టనున్న ఐదు ప్రాజెక్టులు 17 జిల్లాల మీదుగా సాగుతాయి. వీటి ద్వారా 2,121 గ్రామాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడి, సుమారు 52 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలగనుంది.
అదేవిధంగా తూర్పు, మధ్య భారతదేశంలో చేపట్టనున్న మూడు ప్రాజెక్టులు 14 జిల్లాలను కవర్ చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 56 లక్షల జనాభా ఉన్న 4,790 గ్రామాలు రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయి. ఈ ప్రాజెక్టులు ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రాంతీయ రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతం ఇవ్వనున్నాయి.
