అనంతపురం: మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు అనంతపురంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆదిమూర్తి నగర్‌, గుల్జార్‌పేట్‌ ప్రాంతాలకు చెందిన హిందూ, ముస్లిం యువకులు కలిసి ఏటా కళింగ షాపింగ్‌ మాల్‌ రోడ్డులో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

చందాల ద్వారా వచ్చిన మొత్తంతో పాటు యువకుల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది వినాయక విగ్రహం వద్ద లడ్డూ వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేలంలో ముస్లిం యువత, పెద్దలు కూడా పాల్గొంటున్నారు.

గత ఏడాది 61 ఏళ్ల ఖాసింబీ అనే ముస్లిం మహిళ రూ.31 వేలకు గణేష్‌ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. అనంతరం లడ్డూను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు.

ఈసారి కూడా లడ్డూ వేలంలో పాల్గొంటానని ఖాసింబీ తెలిపారు. తాను ప్రతిరోజూ నమాజ్‌ చేస్తూనే హిందువులతో సోదరభావంతో మెలుగుతున్నానని చెప్పారు. గణేష్‌ ఉత్సవ లడ్డూను తాము ఎంతో పవిత్రంగా భావిస్తామని పేర్కొన్నారు.

ఆదిమూర్తి నగర్‌ వినాయక ఉత్సవాలు కుల, మతాలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి జరుపుకునే పండుగకు నిదర్శనంగా నిలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

By Ramya