దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుగా చేపట్టిన ముంబయి–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు కారిడార్‌ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ రైలు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.

ఇంతటి వేగంతో రైలు పట్టాలు మారే సమయంలో ఏర్పడే తీవ్రమైన ఒత్తిడి, ప్రకంపనల ప్రభావాన్ని తగ్గించి ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘కాంటెడ్‌ టర్నౌట్స్‌’ను వినియోగిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు జపాన్‌ సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తోంది. ప్రాజెక్టును డిసెంబరు 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దేశంలో తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది పట్టాలపై పరుగులు తీయనుంది. ముంబయి–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోకి అనేక ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి రానున్నాయి.

గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో అధిక వేగానికి అనుగుణంగా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సాధారణంగా ఇంతటి వేగంతో ప్రయాణించే రైలు పట్టాలు మార్చే సమయంలో తీవ్ర ఒత్తిడి, ప్రకంపనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైలు సమతౌల్యతను కాపాడటం, ప్రయాణికులకు కుదుపులు లేకుండా చూడటం సవాలుతో కూడుకున్న అంశం.

ఈ సమస్యలను అధిగమించేందుకు బుల్లెట్ రైలు కారిడార్‌లో ‘కాంటెడ్ టర్నౌట్స్’ (Canted Turnouts) సాంకేతికతను వినియోగిస్తున్నారు. రైలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ సురక్షితంగా, సునాయాసంగా పట్టాలు మార్చుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు. పట్టాలు మారే సమయంలో ఉత్పన్నమయ్యే ఒత్తిడి, ప్రకంపనలను తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడంలో ఈ సాంకేతికత కీలకంగా ఉండనుంది.

సాధారణ రైల్వే నెట్‌వర్క్‌లలో, ఒక రైలు ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌కు మారే టర్నౌట్‌ ప్రాంతాల్లో సాధారణంగా వంపు మార్గాల్లో కనిపించే బ్యాంకింగ్‌ (పట్టాల అంచులను ఎత్తుగా అమర్చడం) ఉండదు. దీంతో రైలు టర్నౌట్‌ మీదుగా ప్రయాణించే సమయంలో చక్రాలు ఒక్కసారిగా మారుతున్న ట్రాక్‌ కోణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక వేగంతో ఈ మార్పు చోటుచేసుకుంటే రైలు, పట్టాలపై గణనీయమైన ఒత్తిడి మరియు ప్రకంపనలు ఏర్పడటంతో పాటు ప్రయాణికులకు అసౌకర్యం కలగవచ్చు.

అందుకే సాధారణ రైళ్లు కీలకమైన ట్రాక్‌ మార్పుల వద్ద వేగాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అయితే ముంబయి–అహ్మదాబాద్ బుల్లెట్‌ రైలు వంటి హై-స్పీడ్‌ రైల్‌ కారిడార్‌లలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకమైన టర్నౌట్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా రైళ్లు అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ ట్రాక్‌ మార్పును మరింత సాఫీగా నిర్వహించేలా వ్యవస్థను రూపొందించారు.