
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ కుమారుడి మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అతడి తల్లిదండ్రులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తొలుత క్యాంపస్ ప్రధాన గేటు వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో గురువారం నుంచి తల్లిదండ్రులు నిరసన ప్రారంభించారు. ఇదిలా ఉండగా, విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన ఘటనపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఐఐటీ బాంబే అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తల్లిదండ్రులు రవీంద్ర, సోనాలీ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో నిరాహార దీక్షకు దిగారు.
ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించే ముందు వారు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC)ను కలిసి, కేసులో నిందితులుగా పేర్కొంటున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. సాహిల్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబం తరఫు న్యాయవాది సిద్ధార్థ్ ఇంగ్లే ఆరోపించారు.
సాహిల్‌కు సంబంధించిన వీడియోను ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారని, ఆ వీడియో లీక్‌కు సంబంధించిన మూలాలు, పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని న్యాయవాది డిమాండ్ చేశారు.
ఎనర్జీ సైన్స్ విభాగంలో విద్యనభ్యసిస్తున్న సాహిల్ వాకోడే సెప్టెంబర్ 18న పవాయ్ క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. ఈ ఘటనపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అనంతరం కేసు తదుపరి దర్యాప్తు కోసం ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ అయింది.
మహారాష్ట్రలోని యవత్మాల్కు చెందిన సాహిల్, ఐఐటీ బాంబే క్యాంపస్‌లో తనపై కులవివక్ష చూపుతున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారని గతంలో తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సాహిల్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు పోలీసులను కలిసి, ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తొలుత ఐఐటీ క్యాంపస్ ప్రధాన గేటు వెలుపలే నిరసన చేపట్టాలని సాహిల్ తల్లిదండ్రులు పట్టుబట్టారు. అయితే పోలీసులతో జరిగిన చర్చల అనంతరం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరాహార దీక్ష చేపట్టేందుకు వారు అంగీకరించారు.
మరోవైపు, సాహిల్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థులు, సామాజిక ఉద్యమకారుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఐఐటీ బాంబే ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డీన్ పదవి నుంచి తొలగించింది.
అయితే సాహిల్‌పై పరీక్షా హాల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయని, అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఐఐటీ బాంబే పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సంస్థ విడుదల చేసింది. అదే సమయంలో క్యాంపస్‌లో సాహిల్‌పై కులవివక్షకు పాల్పడ్డారనే ఆరోపణలను ఐఐటీ బాంబే యాజమాన్యం ఖండించింది.
