
చీపురుపల్లి, D news: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మెరకముడిదాం మండలంలో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు సామూహికంగా రాజీనామా చేయడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి.
మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపుతున్నట్లు వారు తెలిపారు.
ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) బాటలోనే తాము కూడా నడుస్తామని రాజీనామా చేసిన నేతలు స్పష్టం చేశారు. త్వరలోనే వీరంతా టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీకి ఇది తొలి రాజీనామాల పరిణామం కాదు. గతంలోనూ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ జడ్పీటీసీ దంపతులు పార్టీకి రాజీనామా చేశారు.
2029 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని బొత్స సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గంలో పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
