మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble) విడుదలకు సిద్ధమైంది. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్!

ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ మరో సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొననుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయన రాక నేపథ్యంలో ఈవెంట్‌కు సంబంధించిన ఎంట్రీ పాస్‌లకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఫహాద్ ఫాజిల్ సినిమా వేడుకకు ఎన్టీఆర్ రానుండటంతో అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిత్రబృందం కూడా ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

అక్టోబర్ 2న థియేటర్లలోకి సినిమా

ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించారు.

బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌ను టైటిల్‌గా తీసుకున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాజమౌళి సమర్పణ, ఫహాద్ ఫాజిల్ నటన, ఎన్టీఆర్ రాకతో ఇప్పటికే వార్తల్లో నిలిచిన ఈ సినిమా అక్టోబర్ 2న ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.