
విజయవాడ సమీపంలోని గన్నవరం నియోజకవర్గం పాతపాడులో 15 గిరిజన కుటుంబాల కష్టాలను గుర్తించిన సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహకారంతో వారికి పరిష్కారం చూపించారు. అధికారులతో మాట్లాడి వారం రోజుల్లోనే గిరిజన కుటుంబాలకు పట్టాలు వచ్చేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒకరోజు జాఫర్ గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పాతపాడు వైపు వెళ్తుండగా.. అక్కడ ఓ పెద్ద డంపింగ్ యార్డ్ కనిపించింది. చెత్తకుప్ప వద్ద ఓ మహిళ తన చిన్నారిని ఎత్తుకుని ఏవో వస్తువులు ఏరుకుంటుండగా.. పక్కనే మరో బాలుడు చెత్తలో దొరికిన బిస్కెట్లను తింటూ కనిపించాడు. దీంతో జాఫర్ వారిని పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చెత్తకుప్పల్లో దొరికిన ఆహారాన్నే తమ పిల్లలకు పెడుతున్నామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా చెత్తలో పడేసిన ఆహారం తినడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పరిస్థితిపై ఆరా తీసిన జాఫర్‌కు.. అక్కడ 15 గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా పోలవరం కాలువ పక్కన గుడిసెలు వేసుకుని జీవిస్తున్న విషయం తెలిసింది.
ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. గిరిజనులు నివసిస్తున్న ప్రాంతం ఇరిగేషన్ భూమి అని, అక్కడ నిర్మించిన కొన్ని ఇళ్లను తొలగించినట్లు తెలిపారు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు జాఫర్ వెంటనే స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును సంప్రదించారు. ఈ విషయంపై చిన్న ఇంటర్వ్యూ కోసం రావాలని కోరగా ఎమ్మెల్యే అంగీకరించారు.
జాఫర్ స్వయంగా బైక్‌పై ఎమ్మెల్యేను తీసుకుని పాతపాడులోని గిరిజన కుటుంబాల వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యేను చూసిన గిరిజనులు తమ సమస్యలను వివరించారు. ఇళ్లు లేకపోవడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి పరిస్థితిని స్వయంగా చూసిన యార్లగడ్డ వెంకట్రావు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తాము బాపట్ల ప్రాంతం నుంచి ఎన్నో ఏళ్ల క్రితం పాతపాడుకు వచ్చామని, అప్పటి నుంచి పోలవరం కాలువ పక్కనే గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని గిరిజన కుటుంబాలు ఎమ్మెల్యేకు వివరించాయి. వారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే.. అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
అధికారులు ఇరిగేషన్ భూమిలో పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినప్పటికీ.. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంబంధిత అధికారులతో చర్చలు జరిపి మార్గం అన్వేషించారు. చివరకు వారం రోజుల వ్యవధిలోనే 15 గిరిజన కుటుంబాలకు పట్టాలు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా కలిసి పనిచేస్తే ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించవచ్చని ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైందని పలువురు పేర్కొంటున్నారు. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిజనులతో సరదాగా మాట్లాడిన సందర్భాలు కూడా వీడియోలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
