ఫ్లైదుబాయ్ విమానం బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానం గాల్లో ఉండగానే ఓ పైలట్ విమాన వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

దీన్ని అడ్డుకునేందుకు భారతీయుడైన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ప్రయత్నించగా, సదరు పైలట్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ వెనక్కి తగ్గకుండా పోరాడి, కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన చూపిన ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్‌ విమానంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో కెప్టెన్‌, కో-పైలట్‌ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కో-పైలట్‌ కత్తితో కెప్టెన్‌పై దాడి చేసినట్లు సమాచారం.

ఈ ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌ ధైర్యంగా పోరాడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దాడిలో కత్తిపోట్లకు గురైనప్పటికీ, ఆయన వెనక్కి తగ్గకుండా కో-పైలట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 180 మంది ప్రయాణికులు ఉన్న విమానాన్ని సురక్షితంగా అదుపులోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు కెప్టెన్‌ను హీరోగా ప్రశంసిస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టెల్‌ అవీవ్‌కు ఫ్లైదుబాయ్‌ విమానం బయలుదేరింది. టేకాఫ్‌ అయిన సుమారు రెండు గంటల తర్వాత కాక్‌పిట్‌లో ఈ ఘర్షణ జరిగినట్లు సమాచారం.

ఘర్షణ సమయంలో విమానం ఒక్కసారిగా 34 వేల అడుగుల ఎత్తు నుంచి సుమారు 17 వేల అడుగుల దిగువకు పడిపోయింది. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తొలుత ఎమర్జెన్సీ సంకేతాలు వెలువడగా, ఆ తర్వాత హైజాక్‌ కోడ్‌ రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

అయితే, విమానంలోని ఇతర పైలట్లు వెంటనే కాక్‌పిట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియా వైపు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ప్రయాణికులను రక్షించేందుకు కెప్టెన్‌ చూపిన ధైర్యసాహసాలపై విమానంలోని ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

భారతీయుడైన కెప్టెన్ స్మిత్ మచ్చర్ గత నాలుగేళ్లుగా ఎమిరేట్స్ ప్రభుత్వానికి చెందిన ఫ్లైదుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌లో సేవలందిస్తున్నారు. అంతకుముందు ఆయన దాదాపు పదేళ్లపాటు స్పైస్‌జెట్‌లో పనిచేశారు.

ఆయన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. స్మిత్ మచ్చర్‌కు బోయింగ్ 737 విమానాలను నడపడంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా ఆయనకు విస్తృత అనుభవం ఉండగా, ఇప్పటివరకు 9,750 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది.

2011లో స్పైస్‌జెట్‌లో చేరిన కెప్టెన్ మచ్చర్.. లైన్ ట్రైనింగ్ కెప్టెన్, సీనియర్ కమాండర్ తదితర కీలక హోదాల్లో పనిచేశారు. దాదాపు పదేళ్లపాటు స్పైస్‌జెట్‌లో సేవలందించిన ఆయన, జూన్ 2022లో ఆ సంస్థను వీడి ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు.