
చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘నేతన్నల సేవలో’ పథకం కింద రెండో విడత ఆర్థిక సాయాన్ని త్వరలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది.
లబ్ధిదారుల ఎంపిక గడువును ఈ నెల 3వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. రెండో విడత ఆర్థిక సాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి సవిత తెలిపారు. అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలిస్తూ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని చెప్పారు.
అర్హత ఉన్న ఏ ఒక్క నేతన్నకూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎంపికైన ప్రతి అర్హుడికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి నేతన్నకు ఆర్థికంగా మేలు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, త్వరలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.
