‘మెడ మీద కాడిపెట్టి చెర్నాకోల చేతపట్టి.. హొయ్‌ హొయ్‌ అని అదిలిస్తే రయ్‌ రయ్‌మంటూ పరుగెత్తే మేటి గిత్తను నేను’ అంటూ ఒంగోలు జాతి గిత్తల ఖ్యాతిని చాటిచెప్పే ప్రదర్శన మునిసిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుధవారం సాయంత్రం స్థానిక మినీ స్టేడియంలో ఒంగోలు జాతి గిత్తల అందాల పోటీలు నిర్వహించారు.

అనంతరం జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన సుమారు 200 ఎడ్లతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఎడ్ల అందాల పోటీలు, ర్యాలీని ప్రారంభించారు. ఎడ్లబండిపై ప్రయాణిస్తూ ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ పి.రాజాబాబు, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్‌, ప్రకాశం భవన్‌, ట్రంక్‌రోడ్డు, పాత కూరగాయల మార్కెట్‌ మీదుగా అద్దంకి బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు కొనసాగింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులు ఆకుపచ్చ కండువాలు ధరించి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

ఒంగోలు జాతి గిత్తల అందాల ప్రదర్శనను వీక్షించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారికి ఇరువైపులా ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. అందాల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎడ్ల యజమానులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ పి.రాజాబాబు బహుమతులు అందజేశారు.

మొదటి బహుమతిగా రూ.50 వేల నగదు బహుమతిని లింగారెడ్డి శ్రీకాంత్‌రెడ్డి ఎడ్లు గెలుచుకోగా రెండో బహుమతి రూ.40 వేలను రాయపాటి విశ్వేశ్వరరావు గిత్తలు సొంతం చేసుకున్నాయి. విజేతలకు నగదు చెక్కులతో పాటు జ్ఞాపికలను అందజేశారు.

By Rajini