
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని బిర్లా గడ్డ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫ్రీ బస్సు, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తమవుతోందని మంత్రి పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే ఎఫ్‌టీవో ఏర్పాటు చేశామని, కర్నూలు అభివృద్ధికి రూ.50 వేల కోట్లను కేబినెట్ మంజూరు చేసిందని తెలిపారు. డ్రోన్ రంగానికి కర్నూలును కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి టీజీ భరత్ అన్నారు.
