
వైసీపీ నేతలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు రణరంగం సృష్టించారని ఆరోపించారు.
డీఎస్సీలో 372 పోస్టులను విక్రయించారంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని గాదె మండిపడ్డారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులే రోడ్లపైకి వచ్చి ఎలాంటి అక్రమాలు జరగలేదని చెబుతున్నారని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగాల భర్తీలోనూ అక్రమాలు జరిగాయని గాదె ఆరోపించారు. వైసీపీ కోసం పనిచేసిన వారికి మాత్రమే అప్పట్లో ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద 3,677 ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొంటూ వాటికి సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణ చేపట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ అంశాన్ని తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
