
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల డైట్ ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. డైట్ ఛార్జీల పెంపుతో గిరిజన, సాంఘిక, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
డైట్ ఛార్జీలను పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం క్రీడలు, విద్య, సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వం వెనుకాడదని మంత్రి స్పష్టం చేశారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులకు డైట్ ఛార్జీలను రూ.1,150 నుంచి రూ.1,265కు పెంచింది.
7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.1,400 నుంచి రూ.1,600కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఆపై తరగతుల విద్యార్థులకు డైట్ ఛార్జీలను రూ.1,600 నుంచి రూ.1,800కు పెంచింది. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు వారానికి ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్‌తో పాటు ప్రతిరోజూ పాలు, పండ్లు అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
