గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎన్జీవో అధ్యక్షులు విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

“కేవలం 25 రోజుల్లోనే ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలతో పాటు రెండు డీఏలను ప్రభుత్వం చెల్లించింది. అలాగే డిసెంబర్ 1 నుంచే పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ వర్తించేలా చర్యలు చేపట్టింది” అని విద్యాసాగర్ తెలిపారు.

ఆరోగ్య కార్డుల సమస్య పరిష్కారానికి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ప్రతి నెలా రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నిధులను నేరుగా ట్రస్ట్‌కు జమ చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో తొలిసారిగా ఆరోగ్య కార్డు నిధులు నేరుగా ట్రస్ట్‌కు వెళ్లేలా నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు.

పీఆర్‌సీ కమిటీ చైర్మన్‌గా మాజీ సీఎస్ దినేష్ కుమార్‌ను నియమించడం పట్ల కూడా విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు.

ఉద్యోగులకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఉద్యోగులు, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఏపీ ఎన్జీవో అధ్యక్షులు విద్యాసాగర్ పేర్కొన్నారు.

By Rajini