
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నంలోగా పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పిటిషన్ శనివారం దాఖలైతే వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు పంచాయతీరాజ్, పురపాలక శాఖలకు సంబంధించి సీనియర్ న్యాయవాదులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని న్యాయ నిపుణులతో చర్చించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
