మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

వివేకానందరెడ్డి హత్య కేసులో రూ.40 కోట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో భాగంగా ఇప్పటికే హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరితో పాటు నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది.

రూ.40 కోట్లకు సంబంధించిన లావాదేవీలపై ప్రధానంగా 2019 నుంచి సంబంధిత వ్యక్తుల బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర వివరాలను ఈడీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌, కడప సహా ఏడు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాల్లో కొన్ని పత్రాలు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మరోవైపు, హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను కూడా ఈడీ విచారించింది. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డితో ఆయనకు ఉన్న ఫోన్‌ సంబంధాలు, కాల్‌ వివరాలపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గూగుల్‌ టేక్‌అవుట్‌ డేటాను పరిశీలిస్తూ కూడా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లో ఉన్నట్లు సునీల్‌ యాదవ్‌ ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తనకు కొందరు వైఎస్సార్‌సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన అధికారులకు తెలిపినట్లు కూడా తెలుస్తోంది. అలాగే ఆయన ఆర్థిక లావాదేవీలు, ఆయన భార్య బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం.

వివేకానందరెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్‌ కోణాన్ని పరిశీలిస్తున్న ఈడీ.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజాగా అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ కావడంతో, ఈ నెల 14న జరిగే విచారణలో ఏ అంశాలపై అధికారులు ప్రశ్నించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

By Ramya