
కోనసీమ ప్రాంతానికి రైల్వే అనుసంధానం కల్పించే కీలకమైన కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.100 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్ర వాటా కింద కేటాయించిన ఈ నిధులను భూసేకరణకు వినియోగించనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించినట్లు సమాచారం. మంజూరైన రూ.100 కోట్లు అమలాపురం ఆర్డీవోకు అందనున్నాయి. దీంతో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
కోటిపల్లి–నరసాపురం కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు 2001–02లోనే ఆమోదం లభించింది. తొలుత సుమారు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2,120 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.3,900 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా, మిగిలిన వ్యయాన్ని రైల్వే శాఖ భరించనుంది. రైల్వే శాఖ వాటాగా రూ.1,454 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా సుమారు రూ.484 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.52.69 కోట్లు చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా సమకూర్చాల్సి ఉంది.
గతంలో భూసేకరణ వరకు రాష్ట్ర వాటాను భరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 25 శాతం భరించే ప్రతిపాదనపై స్పష్టత లేకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయంలో తన 25 శాతం వాటాను భరించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో భూసేకరణ కోసం తాజాగా రూ.100 కోట్లు మంజూరు చేయడం ప్రాజెక్టుకు కీలక పరిణామంగా భావిస్తున్నారు. ప్రభుత్వ నిధుల విడుదలతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ రైల్వే అనుసంధానం పూర్తయితే కోనసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
