ఆంధ్రప్రదేశ్‌లో పీజీ చదవాలనుకుంటున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున రెండేళ్లకు మొత్తం రూ.3 లక్షల స్కాలర్‌షిప్‌ అందించనుంది. ఈ మేరకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ స్కాలర్‌షిప్‌ కింద విద్యార్థులకు నెలకు రూ.15 వేల చొప్పున ఏడాదిలో 10 నెలల పాటు నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డీబీటీ విధానంలో జమ చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 10 వేల మంది విద్యార్థులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇందులో యువతులకు 30 శాతం కేటాయింపు ఉంటుంది.

అర్హతలు ఇవే

  • దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.
  • ఇంటర్‌, డిగ్రీలో 80 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి.
  • నాక్‌ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాలలో కన్వీనర్‌ కోటా ద్వారా పీజీ మొదటి సంవత్సరం ప్రవేశం పొంది ఉండాలి.
  • జాతీయ స్థాయి యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
  • విద్యార్థుల ఎంపిక మెరిట్‌ ఆధారంగా జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హులైన విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (NSP) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ‘Student’ ఆప్షన్‌ను ఎంచుకుని One Time Registration (OTR) పూర్తి చేయాలి. అనంతరం ‘Apply for Scholarship’ ఆప్షన్‌ ద్వారా అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంటర్‌, డిగ్రీ మార్కుల జాబితాలు, పీజీ ప్రవేశానికి సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

అర్హులైన విద్యార్థులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 15న ప్రాథమిక జాబితాను విడుదల చేయనుండగా, నోడల్‌ అధికారుల పరిశీలన అనంతరం నవంబర్‌ 30న తుది ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించనున్నారు.

పీజీ విద్యను కొనసాగించాలనుకుంటున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా రెండేళ్లలో రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం లభించనుంది.

By Ramya