ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మరోసారి భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. మరోవైపు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఉత్తర కోస్తా తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

పలు జిల్లాల్లో కొనసాగుతున్న ఎండ తీవ్రత

వర్ష సూచన ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. గురువారం ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి, అమరావతి, కర్నూలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైనట్లు సమాచారం.

మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావం రానున్న శీతాకాలంలోనూ కనిపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏపీలో 34.9 శాతం లోటు వర్షపాతం

ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 589.7 మిల్లీమీటర్లు కాగా, 383.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో మొత్తం 34.9 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అన్నమయ్య జిల్లాలో తీవ్ర లోటు వర్షపాతం నమోదవగా, మరో 20 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాలు తగ్గుముఖం పట్టిన అనంతరం మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో వర్షాలతో పాటు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

By Ramya