
దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాల షూటింగ్స్.. మరోవైపు టీవీ షోలు, మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నిత్యం సందడిగా కనిపిస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తన తదుపరి సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌పై ఆయన ఫోకస్ పెట్టారు.
సంక్రాంతి రిలీజ్‌పై క్లారిటీ..
వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80-90 శాతం పూర్తయినట్లు సమాచారం. సంక్రాంతి బరిలో జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు టైటిల్లోనే ప్రకటించిన నేపథ్యంలో.. ఆ తేదీకి తగ్గట్టుగానే పనులను పూర్తి చేసేలా చిత్రబృందం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనిల్ ఈసారి కూడా రిలీజ్ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదనే పట్టుదలతో ఉన్నట్లు టాక్.
మహేష్ బాబు రూమర్‌పై క్లారిటీ
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నారనే అంశంపై ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ వార్తలపై అనిల్ రావిపూడి స్వయంగా స్పందించడంతో ఆ రూమర్‌కు ఫుల్స్టాప్ పడింది. అయితే ఇప్పుడు దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చిరంజీవి–నాగార్జున కాంబో.. మరోవైపు ‘రామాయణం’?
సీనియర్ స్టార్ హీరోల్లో దాదాపు అందరితోనూ అనిల్ రావిపూడి సినిమాలు చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు నాగార్జునతోనూ సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిపి చిరంజీవి–నాగార్జున కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నాడనే మరో ఆసక్తికరమైన రూమర్ వినిపిస్తోంది.
ఇదే సమయంలో అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు భిన్నంగా ఓ యానిమేషన్ మూవీపై దృష్టి పెట్టినట్లు మరో వార్త చక్కర్లు కొడుతోంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని మైథలాజికల్ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారని టాక్. ఈ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
