వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఈ ఎన్నికలను అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ సంస్థలకు చెందిన కీలక వ్యక్తి పరిమళ్ నత్వానీ కుమారుడిని తమ అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఎన్డీయే మద్దతుతో పరిమళ్ నత్వానీ వరుసగా నాలుగుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాగా, ఆయన కుమారుడు మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం తరఫున నామినేషన్ వేయనుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రిలయన్స్ గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పరిమల్ నత్వానీ ఎన్డీయే కూటమి మద్దతుతో నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తాజాగా ఆయన కుమారుడు ధన్‌రాజ్ నత్వానీని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో నత్వానీ కుటుంబానికి చెందిన ఇద్దరి రాజకీయ ప్రయాణాలు ఒకే సమయంలో వేర్వేరు రాష్ట్రాలతో పాటు పరస్పర ప్రత్యర్థి రాజకీయ కూటములతో ముడిపడినట్టయ్యాయి.

సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్‌తో పాటు ధన్‌రాజ్ నత్వానీ పేర్లను ఎస్పీ తమ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే బీజేపీకి ఏడు, ఎస్పీకి రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. మిగిలిన ఒక్క స్థానాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీల మధ్య పోటీ నెలకొంది.

సమాజ్‌వాదీ పార్టీ తరఫున ధన్‌రాజ్ నత్వానీ.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ధన్‌రాజ్ నత్వానీ.. తనను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లక్నోలో ఆయన సమక్షంలో నామినేషన్ పత్రాలు సమర్పించానని, తన ప్రజా జీవితంలో ఇది కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ధన్‌రాజ్ నత్వానీ పలు కీలక సంస్థల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ద్వారక ఆలయ పరిపాలనా కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. నాథ్‌ద్వారా టెంపుల్ బోర్డు, గుజరాత్ రాష్ట్ర వన్యప్రాణి బోర్డులోనూ సభ్యుడిగా ఉన్నారు.

క్రీడా రంగంతోనూ ధన్‌రాజ్ నత్వానీకి అనుబంధం ఉంది. ముఖ్యంగా క్రికెట్ పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2022లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.