దుబాయ్–టెల్ అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో 170 మందికి పైగా ప్రయాణికులను రక్షించిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చార్.. ప్రధాని మోదీతో మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. తాను తీవ్రంగా గాయపడినప్పటికీ, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో కాక్‌పిట్ తలుపులు తెరిచినట్లు ఆయన వివరించారు.

ఆ క్లిష్ట సమయంలో తాను హనుమాన్ చాలీసాను జపించానని కెప్టెన్ మచ్చార్ ప్రధాని మోదీకి తెలిపారు. ప్రాణాలను కాపాడేందుకు ఎదురైన పరిస్థితులను ఆయన వివరించగా, ప్రధాని మోదీ ఆయన ధైర్యసాహసాలను అడిగి తెలుసుకున్నారు.

అసలేం జరిగింది? విమానంలో పరిస్థితులు ఎలా మారాయి? కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఎలాంటి సాహసం చేశారు? ప్రయాణికులను ఎలా రక్షించారు? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బొంబాయి నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడికి పాల్పడి, విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన సమయంలో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ శుక్రవారం దాదాపు 10 నిమిషాల పాటు వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రమాద సమయంలో ఆయన ప్రదర్శించిన అసాధారణ ధైర్యం, ఓర్పు, సమయస్ఫూర్తిని ప్రధాని ప్రశంసించారు.

తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రయాణికుల భద్రత కోసం కెప్టెన్ మచ్చర్ చేసిన పోరాటం 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని మరింత పెంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చూపిన ధైర్యం, బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్న తీరు అభినందనీయమని అన్నారు

వీడియో కాల్ సందర్భంగా ఘటన జరిగిన సమయంలో ఎదురైన భయానక పరిస్థితులను గుర్తుచేసుకున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు 17 ఏళ్ల విమానయాన అనుభవం ఉందని, అందులో గత 11 ఏళ్లుగా కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్నానని ఆయన ప్రధానికి వివరించారు.

“కళ్లు మూసుకున్నా విమానం ఏ పరిస్థితిలో ఉందో అంచనా వేయగలను. అయితే, కో-పైలట్ అకస్మాత్తుగా నాపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కిందపడిపోయాను. ఆ సమయంలో విమానం క్షణాల్లోనే దాదాపు 14,000 అడుగుల మేర కిందకు పడిపోతున్న విషయం నాకు అర్థమైంది. నేను తీవ్రంగా గాయపడినప్పటికీ, విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలో పడనివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను” అని కెప్టెన్ స్మిత్ మచ్చర్ తెలిపారు.