సుదూర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు మరో వందేభారత్‌ స్లీపర్‌ రైలు అందుబాటులోకి రానుంది. ముంబై–బెంగళూరు మధ్య రెండో వందేభారత్‌ స్లీపర్‌ రైలును నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దసరా నాటికి ఈ రైలు సేవలను ప్రారంభించే అవకాశమున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ రైలు వారంలో ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. బెంగళూరు నుంచి సోమవారం, ముంబై నుంచి మంగళవారం సేవలు ఉండవు. బెంగళూరు నుంచి రాత్రి 10 గంటలకు బయల్దేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి రాత్రి 10:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుతుంది.

ముంబై–బెంగళూరు మార్గంలో ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగనుంది. అనంతరం రాయచూర్‌, కాలబురగి, సోలాపూర్‌, పుణె, కల్యాణ్‌ స్టేషన్లలోనూ హాల్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నడిచే ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌కు దాదాపు 22 గంటల సమయం పడుతోంది.

కొత్తగా అందుబాటులోకి రానున్న వందేభారత్‌ స్లీపర్‌తో ఈ ప్రయాణ సమయం సుమారు 16 గంటలకు తగ్గే అవకాశం ఉంది. దీంతో ముంబై–బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి సమయం ఆదా కావడంతో పాటు రాత్రి ప్రయాణంలో స్లీపర్‌ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

By Rajini