దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరనున్న దుర్గమ్మవారిని దర్శించుకునే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. దేవాలయ పరిసరాల్లో 24 గంటలూ సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంటుందని వెల్లడించారు. దేవాలయ పాలకమండలితో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు.

సీతమ్మవారి పాదాల వద్ద స్నానం చేసి అమ్మవారి దర్శనానికి రావచ్చని భక్తులకు కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 14న సాయంత్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుర్గమ్మవారిని దర్శించుకోనున్నారని తెలిపారు. దసరా ఉత్సవాలకు జాతీయ స్థాయి వీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.

‘స్వచ్ఛ దసరా’ కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 1,400 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని, మూడు మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచనున్నామని వెల్లడించారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు 25 లక్షల మందికిపైగా భక్తులు విజయవాడకు వచ్చే అవకాశం ఉందని దుర్గగుడి ఈవో శీనానాయక్ తెలిపారు. నవరాత్రుల సందర్భంగా రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగుతుందని చెప్పారు.

మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని ఈవో తెలిపారు. ఆ రోజు అన్ని ఆర్జిత సేవలను పరోక్షంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 17న వేద సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. నవరాత్రుల సందర్భంగా భక్తుల కోసం తాగునీరు, హోల్డింగ్ ఏరియాల్లో ఆహార సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

అమ్మవారికి కుంకుమ పూజలు యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ స్థలం నుంచి కుంకుమార్చన చేసుకునే భక్తుల కోసం వాహనాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అత్యవసర నిష్క్రమణ మార్గాలను (ఎమర్జెన్సీ ఎగ్జిట్స్) సిద్ధం చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈవో శీనానాయక్ తెలిపారు.

By Rajini