రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఈ లక్ష్యం సాకారం అవుతోందని తెలిపారు. మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

మదనపల్లెకు ఘనమైన చరిత్ర ఉందని లోకేశ్ అన్నారు. త్యాగాలకు, పోరాటాలకు ఈ ప్రాంతం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ఆయన.. రైతులు బాగుంటే దేశం బాగుంటుందని గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

తన పాదయాత్ర సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని లోకేశ్ తెలిపారు. అయితే ప్రజల ఆశీస్సులతో వాటన్నింటినీ అధిగమించగలిగామని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని గతంలోనే హామీ ఇచ్చామని, ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నాయని లోకేశ్ పేర్కొన్నారు. మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ నిర్మాణం ఈ లక్ష్య సాధనలో కీలక ముందడుగని తెలిపారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాలయాలుగా భావిస్తారని లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్‌ను పరిచయం చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని ‘వాటర్‌మన్’గా పిలుస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

By Rajini