
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంతెన కల సాకారమైంది. రూ.6.54 కోట్ల వ్యయంతో నిర్మించిన పొట్టేపాలెం కలుజు బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.
బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో నెల్లూరు రూరల్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. అంతేకాకుండా జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం, నరసింహస్వామి ఆలయం, ఏఎస్‌పేట దర్గా వంటి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే భక్తులకు కూడా ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి నిర్మాణం కోసం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు 11 ఏళ్లుగా ప్రయత్నాలు కొనసాగించినట్లు కార్యక్రమంలో పేర్కొన్నారు. చివరకు రూ.6.54 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట.. నేడు సాకారం
2024 ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి కొండలపూడి సంఘం వద్ద చలపతి అనే స్థానికుడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేకపోయారని చలపతి ఆమెను ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు తాను ఇచ్చిన సమాధానానికి ప్రతిరూపంగా నేడు పూర్తయిన పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి ప్రజల ముందుందని సాయి వైష్ణవి పేర్కొన్నారు. అప్పటి సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా సాయి వైష్ణవి స్పందిస్తూ.. పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి పూర్తవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వంతెన నిర్మాణానికి సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సుబ్బారెడ్డి, చలపతి తదితరులు హాజరయ్యారు.
