విశాఖపట్నంలోని ఋషికొండ ఐటీ హిల్స్ బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవు రోజు కావడంతో బీచ్‌కు విహారానికి వచ్చిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు సముద్ర కెరటాల్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిని నితీష్ (15), సూర్య ప్రకాష్ (14), ప్రశాంత్ (13)గా పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రశాంత్ మృతదేహం లభ్యమైంది. నితీష్, సూర్య ప్రకాష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఏసీపీ అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం ఐదుగురు స్నేహితులు బీచ్‌కు వచ్చి సముద్రం వద్దకు వెళ్లారు. సముద్రంలోకి వెళ్లొద్దని మెరైన్ పోలీసులు హెచ్చరించినప్పటికీ కాళ్లు కడుక్కొని వస్తామని చెప్పి నలుగురు బాలురు నీటిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బలమైన కెరటం రావడంతో ఒక బాలుడు ఒడ్డుకు చేరుకోగా.. మిగిలిన ముగ్గురు కెరటాల్లో కొట్టుకుపోయారు. ఘటన సమయంలో సముద్రంలో కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే మెరైన్ పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం స్కూబా డైవర్లను, నేవీ హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను సీపీ బాగ్చి ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు.

గాలింపు చర్యల్లో భాగంగా సముద్రంలో తేలుతూ కనిపించిన ప్రశాంత్ మృతదేహాన్ని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. మిగిలిన ఇద్దరు బాలురు నితీష్, సూర్య ప్రకాష్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటన విషయం తెలిసి బీచ్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు, గల్లంతైన బాలల్లో కొందరు వెంకటేశ్వర స్కూల్, సృజన స్కూళ్లలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

By Rajini