
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ‘రుద్ర’ పాత్రలో మహేష్ నటన గురించి జక్కన్న చేసిన ప్రశంసలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.
మహేష్ నటన చూసి ఆశ్చర్యపోయా..
అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్ విద్యార్థులతో జరిగిన సంభాషణలో రాజమౌళి ‘వారణాసి’ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నట్లు సమాచారం. షూటింగ్ ప్రారంభానికి ముందు మహేష్ నుంచి అత్యుత్తమ నటనను ఎలా రాబట్టాలా అని ఆలోచించానని.. అయితే సెట్స్‌పై ఆయన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తానే ఆశ్చర్యపోయానని రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది.
తాను వంద శాతం ఆశిస్తే.. మహేష్ ఏకంగా రెండొందల శాతం ఎఫర్ట్ పెట్టారని జక్కన్న ప్రశంసించినట్లు సమాచారం. ‘రుద్ర’ పాత్రలో మహేష్ కేవలం నటించలేదని, ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయారని రాజమౌళి పేర్కొన్నట్లు తెలుస్తోంది.
స్టార్డమ్ కంటే కథకే ప్రాధాన్యం..
కాస్టింగ్ విషయంలో స్టార్ ఇమేజ్ను కాకుండా కథకు సరిపోయే నటులను ఎంపిక చేయడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని రాజమౌళి స్పష్టం చేసినట్లు సమాచారం. ‘రుద్ర’ పాత్రకు మహేష్ బాబు సరైన ఎంపికగా నిలిచారని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
ఇక ‘వారణాసి’ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. కథలో భాగంగా విభిన్న ప్రాంతాలు, కాలాలకు సంబంధించిన అంశాలు ఉండనున్నాయనే ప్రచారం ఇప్పటికే ఉంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
