విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకునేందుకు చిత్రబృందం ‘నెవర్ ఫర్గెట్ ది ట్రూత్’ పేరుతో నాలుగు భాగాల డాక్యుమెంటరీని విడుదల చేస్తోంది.

గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి నుంచి ఆ ఆలోచన..

ఈ డాక్యుమెంటరీలో మూడో భాగమైన ‘ది మెన్ వి ఫర్గాట్’ తాజాగా విడుదలైంది. ఇందులో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కథ, పాత్రల రూపకల్పన వెనుక ఉన్న ఆలోచనలను వివరించారు.

గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి గురించి విన్నప్పుడే ‘రణబాలి’ కథకు బీజం పడిందని రాహుల్ తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని పాలెగాళ్ల వీరగాథలు ఇప్పటికీ ప్రజల్లో, బుర్రకథల్లో వినిపిస్తుంటాయని చెప్పారు. వారి ధైర్యసాహసాలు, పోరాటాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని వెల్లడించారు.

రాయలసీమ వీరులే స్ఫూర్తి..

కరవు కాలంపై పరిశోధన చేస్తున్న సమయంలో బుడ్డా వెంగళరెడ్డి గురించి తెలుసుకున్నానని రాహుల్ చెప్పారు. కరవు సమయంలో తన ఆస్తులను విక్రయించి గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి వేలాది మందికి సాయం చేసిన ఆయన సేవలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాహసం కూడా తనపై ప్రభావం చూపిందన్నారు.

తాను కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తినేనని చెప్పిన రాహుల్.. చిన్నతనంలో ధైర్యసాహసాలతో పాటు శారీరక దారుఢ్యంతో ఉండే పలువురిని చూశానని తెలిపారు. అలాంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందే ‘రణబాలి’ పాత్రను రూపొందించినట్లు వెల్లడించారు.