
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బాయిలర్ పేలిన సమయంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు శ్రీసిటీలోని ప్రైవేట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
