దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో కో-పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై పదునైన ఆయుధంతో దాడి చేసి, అనంతరం విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. అయితే, కో-పైలట్ కుట్రను కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ సమర్థంగా అడ్డుకున్నారు.

తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన ఏమాత్రం మనోధైర్యం కోల్పోలేదు. తన ప్రాణాల కంటే విమానంలో ఉన్న 180 మంది ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చి, వారిని కాపాడేందుకు చివరి వరకు పోరాడారు.

ఈ ఘటనపై కెప్టెన్ స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్ఛార్ తాజాగా స్పందించారు. తన కుమారుడి ధైర్యసాహసాలను గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు ప్రదర్శించిన తెగువ, బాధ్యతాభావం పట్ల తండ్రిగా గర్విస్తున్నట్లు తెలిపారు.

స్మిత్ మచ్ఛార్ కుటుంబ సభ్యుల స్పందన

కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని, విమానంలోని 174 మంది ప్రాణాలను కాపాడిన ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ కుటుంబ సభ్యులు తొలిసారి స్పందించారు. తమ కుమారుడి భద్రతపై తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. అతడి ధైర్యసాహసాలను తలచుకుని గర్వంతో భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ ఘటనపై స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్ఛార్ ఎన్డీటీవీతో మాట్లాడారు. దాడి గురించి తెలిసిన క్షణంలో తమ కుటుంబం ఎంతటి ఆందోళనకు గురైందో ఆయన వివరించారు. ‘‘మా బిడ్డకు ఇలా జరిగిందన్న వార్త వినగానే మొదట షాక్‌కు గురయ్యాం. ఏ తల్లిదండ్రులకైనా అలాంటి సమయంలో భయం, ఆందోళన కలగడం సహజమే. వెంటనే ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి, ఎలాంటి చెడు వార్త వినకూడదని, మా బిడ్డ ప్రాణాలను కాపాడాలని ప్రార్థించాం’’ అని భూపేంద్ర మచ్ఛార్ గుర్తుచేసుకున్నారు.

అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ తన కుమారుడు ధైర్యాన్ని కోల్పోకుండా విధి నిర్వహించగలిగినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. స్మిత్ చూపించిన తెగువ, సమయస్ఫూర్తి పట్ల తండ్రిగా గర్విస్తున్నానని భూపేంద్ర మచ్ఛార్ భావోద్వేగంతో తెలిపారు.

“ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎవరూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోరు. అయితే, అది దేవుడి దయేనని నేను భావిస్తున్నాను. ఏదో ఒక శక్తి అతడికి మార్గనిర్దేశం చేసింది. సంక్షోభ సమయంలో తన శక్తినంతా కూడదీసుకుని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇది చాలా వరకు దేవుడి ఆశీర్వాదమే అని నమ్ముతున్నాను” అని భూపేంద్ర మచ్ఛార్ తెలిపారు.

తన గాయపడిన కుమారుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని, అయితే పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. “గాయాలు మానేందుకు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. తలకు, రెండు చేతులకు గాయాలయ్యాయి. తలకు శస్త్రచికిత్స కూడా జరిగింది. అనేక కుట్లు పడ్డాయి. పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది” అని భూపేంద్ర మచ్ఛార్ వివరించారు.